నడక మార్గం వైపు వస్తున్న చిరుతలు
తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.