భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ వేళ అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగికి ఉదయాన్నే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
గమనించిన తోటి సిబ్బంది ఆయన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. శ్రీ కృష్ణ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.









