AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అట్టుడికిన రెంట్యాల.. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

(అమ్మన్యూస్‌, గుంటూరు):

గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంట్యాల గ్రామం భయంతో వణికిపోతోంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల ఘర్షణతో రెంటాల అట్టుడికిపోతోంది. ఈ ఉదయం పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఓటర్లు ఓటు వేసేందుకు భయపడిపోతున్నారు. వైసీపీ, టీడీపీ శ్రేణుల బీభత్సంతో జంకిపోతున్నారు. మరోవైపు పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాలకు మందకొడిగా వెళ్తూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే గ్రామంలో మాత్రం ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఉదయం వైసీపీ, టీడీపీ శ్రేణులు కొట్టుకున్నాయి. పరస్పరం రాళ్లు, కర్రలు, చెప్పులతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన చాలా మందికి గాయాలయ్యాయి. వారికి చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి.

అయితే గ్రామంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. గ్రామంలో ఇళ్ల వద్ద ఉంచిన టీడీపీ నేతల కార్లకు నిప్పుపెడుతున్నారు. దీంతో గ్రామంలో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలతో అటు పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. గ్రామంలో పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. రోడ్లపై ఎవరు కనిపించినా అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ANN TOP 10