తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఓ వైపు పోలింగ్ ఏర్పాట్లు, మరోవైపు భద్రత ఏర్పాట్లు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. మే నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై ఎలాంటి ఫోకస్ పెట్టారో.. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల భద్రతకు 73, 414 సివిల్ పోలీసులు, 500 రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు రంగంలో దించినట్లు తెలిపారు. అలాగే, తమిళనాడుకు చెందిన మూడు స్పెష ల్ ఆర్మ్‌డ్ కంపెనీలు, 2,088 ఇతర శాఖల సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలిపారు. 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులను వినియోగిస్తున్నామని తెలిపారు.









