AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటర్లకు డిస్కౌంట్ ఆఫర్లు .. ఫ్రీ రైడ్స్, ఫుడ్‌పై 50 శాతం డిస్కౌంట్

ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. రేపు ఓటర్లంతా తమ నిర్ణయాన్ని ఈవీఏం బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. అయితే ఎంతో విలువైన ఓటు హక్కును చాలా మంది బద్దకం వల్లో, నిర్లక్ష్యంతో వినియోగించుకోవట్లేదు. అలాంటి వారి కోసం ఎన్నికల సంఘంతో పాటు మేము సైతం అంటూ ప్రైవేటు సంస్థలు కూడా నడుం బిగించాయి. ఇందుకోసం ఓటేసిన వాళ్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ట్రావెలింగ్ దగ్గరి నుంచి మొదలు రాత్రి డైనింగ్ వరకు ఆఫర్లే ఆఫర్లు ప్రకటించాయి.

ఎన్నికల ఆఫర్లు

మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఓటర్లంతా తమ తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే.. ఓటింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘంతో పాటు ఇటు రాజకీయ నాయకులు కూడా రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. పోలింగ్ డేను పెయిడ్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రావెల్స్ దగ్గరి నుంచి ఆస్పత్రులు, హోటళ్లు, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల వరకూ పలు సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించాయి. అయితే.. ఈ ఆఫర్ల వెనుక ఆ సంస్థల ప్రయోజనాలు దాగి ఉన్నప్పటికీ.. తమ ఆఫర్ల ద్వారా ఓటింగ్‌ కూడా ఎంతో కొంత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ అమల్లో ఉన్న ఆఫర్లు ఏంటనేది పరిశీలిద్దాం.

ర్యాపిడో ఫ్రీ రైడ్స్..

పోలింగ్ డే రోజున హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ర్యాపిడో సంస్థ ఫ్రీ రైడ్స్ సేవలు అందిస్తోంది. ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వరకు ఫ్రీగా తీసుకెళ్లనుంది. ఓటు వేసేందుకు వెళ్లే దివ్యాంగులు ఆటోలు, క్యాబ్‌లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ర్యాపిడో యాప్‌‌లో వోట్ నౌ (VOTE NOW) అనే కూపన్ కోడ్‌‌ను ఉపయోగించి ఫ్రీ రైడ్‌‌ను పొందొచ్చని సంస్థ పేర్కొంది.

ఫ్రీ కన్‌సల్టేషన్..

ఇదిలా ఉంటే.. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వారికి డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఉచితంగా అందించడంతో పాటు ల్యాబ్‌ పరీక్షల్లో 50 శాతం రాయితీ ఇస్తామని ఏఐజీ ఆస్పత్రులు ప్రకటించాయి. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ తమ ఆసుపత్రిలో ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుందని ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్, చీఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటు వేసి హాస్పిటల్‌కి వచ్చి సిరా గుర్తు చూపించి ఈ సదుపాయం పొందాలని సూచించారు. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల వరకు ఈ అవకాశం ఉంటుందని ఓటర్లకు వెల్లడించారు.

ఫుడ్‌పై డిస్కౌంట్లు

మరోవైపు.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తాము సైతం అంటూ పలు రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ముందుకొచ్చాయి. రెస్టారెంట్స్‌ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు.. కొన్ని రెస్టారెంట్‌ చైన్స్‌ ఇప్పటికే పలు నగరాల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. ఓటేసిన మార్కు చూపితే టికెట్‌పై మాత్రమే కాకుండా ఫుడ్‌, డ్రింక్స్‌పై రాయితీ అందించనున్నారు.

ఊరెళ్లే వారి కోసం

ఇక ఓటేసేందుకు ఇప్పటికే చాలామంది ఊరెళ్లిపోయారు. మరి కొంతమంది ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ఓటర్ల కోసం ప్రత్యేక ప్రయాణ సౌకర్యాలు ఏర్పాట్లు చేయగా టీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. ఇక.. రెడ్‌బస్‌, అభి బస్‌ లాంటి సంస్థలు కూడా టికెట్లపై దాదాపు 20 శాతం రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించాయి.

విమానం టికెట్‌పై డిస్కౌంట్

ఇదిలా ఉంటే.. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కూడా ఇందులో భాగమైంది. తొలిసారి ఓటేసే యువకులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. చదువు కోసమో, ఉద్యోగం కోసమో వేర్వేరు నగరాలకు వెళ్లిన యువత సొంతూరులో ఓటేయడానికి వెళ్లాలనుకుంటే టికెట్లపై 19 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్‌ను ఏప్రిల్‌ 19న ప్రకటించగా సంస్ధ వెబ్‌సైట్‌లో జరుగుతున్న ప్రతి 20 బుకింగ్‌లలో ఒకటి ఫస్ట్‌ టైం ఓటర్‌దే కావడం విశేషం. అయితే ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది.

డైనింగ్‌పై 50 శాతం డిస్కౌంట్

మరోవైపు ఓటర్ల కోసం డైనింగ్‌ ఔట్‌ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఓటు వేసిన వాళ్లు సిరా గుర్తు చూపిస్తే చాలు హైదరాబాద్‌లో కొన్ని ప్రముఖ రెస్టారెంట్‌లలో తమ డైనవుట్‌ ద్వారా డైనింగ్‌పై 50 శాతం డిస్కౌంట్స్ అందిస్తామంటుంది. ఈ రెస్టారెంట్‌లలో అంటేరా కిచెన్‌ అండ్‌ బార్‌, పాపాయ, ఎయిర్‌ లైవ్‌, నోవోటెల్‌, లీ మెరిడియన్‌, రెడ్‌ రైనో, కాఫీ కప్‌ వంటివి ఉన్నాయి.

ANN TOP 10