ఏపీలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల పోరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూనే ఓటర్లను ఆకట్టుకొనేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అటు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో ప్రధాని మోదీ నుంచి చంద్రబాబు, పవన్ కు ఆహ్వానం అందింది. ఈ నెల 14న ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలను ప్రధాని ఆహ్వానించారు.
ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మోదీ ఆహ్వానం అందింది. చంద్రబాబుతో పాటుగా పవన్ వారణాసి కి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు మంగళవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. మోదీ నామినేషన్ సమర్పణ కార్యక్రమ అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరిన తరువాత ఎన్డీఏ సమావేశం జరగలేదు. వెంటనే ఎన్నికల కోడ్ రావటం..ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మోదీ రాష్ట్రానికి వచ్చారు. రేపు (సోమవారం) ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఏపీలో గెలుపు, మెజార్టీ ఎంపీ సీట్లు దక్కుతాయనే అంచనాలతో కూటమి నేతలు ఉన్నారు. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ చివరి నిమిషంలో కీలకం కానుంది. ప్రస్తుతానికి పోటీ హోరా హోరీగా కనిపిస్తున్నా…పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ సరళి పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పోలింగ్ ముగిసిన మరుసటి రోజునే చంద్రబాబు..ప్రధాని మోదీతో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.









