ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంపై రాజకీయ పార్టీలకు ఓ మహిళ బిగ్ షాక్ ఇచ్చింది. సదరు మహిళ తన ఇంటికి పెట్టిన బోర్డును ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతకీ అదేంటో చూద్దాం..
ఏలూరు కొత్తపేటకు చెందిన కొట్ని పార్వతి అనే మహిళ.. ఓట్లకు డబ్బుల పంపిణీపై తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. ‘‘ మా ఓట్లు అమ్మబడవు’’ అంటూ ఇంటి గేటుకు బోర్డు పెట్టేసింది పార్వతి. ‘‘మా కుటుంబంలో ఎలక్షన్కు అభ్యర్థులు ఇచ్చే డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు. ప్రతి ఒక్కరకు ఆలోచన రావాలని ఉద్దేశంతోనే ఈ బోర్డు పెట్టాము. చదువుకునే విద్యార్థులు కూడా ఆలోచించి ఓటుకు డబ్బులు తీసుకోకూడదని తమ తల్లిదండ్రులకు తెలియజేయాలి. యువతతోనే మార్పు వస్తుంది. డబ్బులు తీసుకుంటే గెలిచిన తర్వాత నాయకులను మన సమస్యలపైన నిలదీయలేము. ఓటు డబ్బుతో కొనేది కాదు.. ఓటి వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఇదేవిధంగా ఆలోచించి అందరికీ తెలియజేయాలని మనవి చేస్తున్నా.’’ అంటూ పార్వతి తెలిపారు. సో.. ప్రతీ ఒక్కరూ పార్వతిలా ఆలోచించి ఓటేయండి.









