తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అధికారులు శిక్షణ ఇవ్వగా.. ఇవాళ రాత్రి వరకు సిబ్బంది తమతమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి వరకు 35,809 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకుంటాయి. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది వెళ్లే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ చేశారు. ముందు జాగ్రత్తగా అందుబాటులో అదనంగా 15వేల ఈవీఎంలు సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరిదిద్దేందుకు ఈసీఐఎల్ ఇంజినీర్లును అందుబాటులో ఉంచారు. ఈవీఎంల పంపిణీని సీఈఓ వికాస్ రాజ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 3,226 పోలింగ్ స్టేషన్లు, అత్యల్పంగా మహబూబాబాద్ లో 1,689 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లు 9,900 ఉండగా.. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 30శాతం సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. మరోవైపు 10, 12, 14 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు మూడు కాగా.. 25 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 11 ఉన్నాయి. 50 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 22 ఉన్నాయి.









