AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పట్టుబడితే.. జట్టుకడితే.. సిద్దిపేట నుంచే లక్ష మెజార్టీ పక్కా

సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో తనకు తెలుసునని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ మాట్లాడారు. వెంకట్రామిరెడ్డి గెలుపులోనే సిద్దిపేట జిల్లా గెలుపు ఉందని.. మెదక్‌ పార్లమెంటు గెలుపు ఉన్నదని స్పష్టం చేశారు. వెంకట్రామిరెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సిద్దిపేట ప్రజల గొప్ప స్వాగతం తన గుండెల నిండా సంతోషం కలిగించిందని కేసీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట జిల్లా కావాలని అడిగానని తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తాను ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేటను జిల్లాగా చేసుకున్నామని గుర్తుచేశారు. జిల్లా చేసుకోవడమే కాకుండా సిద్దిపేటకు రైలు తెచ్చుకున్నామని.. నీళ్లు తెచ్చుకున్నామని చెప్పారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానని అంటున్నదని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తీసేస్తామంటే మరో యుద్ధానికి సిద్ధమా? అని పిలుపునిచ్చారు. ప్రజలకు పరిపాలన తీసుకురావాలని జిల్లాలను చేస్తే.. ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఎంతో సేవ చేశారని కేసీఆర్‌ గుర్తు చేశారు. హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నామని.. ఆ అభివృద్ధి కొనసాగాలంటే.. మన హక్కులు రావాలంటే.. మన నీళ్లు మనకే ఉండాలంటే.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20 వేల మెజారిటీ ఇచ్చి.. అంటే ఒక లక్ష మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా మెజార్టీతోనే వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిచిపోయారని ధీమా వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి గెలుపులోనే సిద్దిపేట జిల్లా గెలుపు ఉందని.. మెదక్‌ పార్లమెంటు గెలుపు ఉన్నదని అన్నారు. వెంకట్రామిరెడ్డి డబ్బులు, పదవుల కోసం ఆశపడి రాలేదని చెప్పారు. తన మాట, హరీశ్‌రావు మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజార్టీని సిద్దిపేట నుంచే ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీరు ఎటువంటి పులులో తనకు తెలుసని సిద్దిపేట ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు పట్టబడితే.. జట్టు కడితే లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని వ్యాఖ్యానించారు.

ANN TOP 10