కాంగ్రెస్‌కు బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని, రైతు బంధు నిధులు కూడా రైతుల ఖాతాలో వేశామన్నారు. మరో గ్యారంటీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని, త్వరలోనే మరో గ్యారంటీని కూడా అమలు చేస్తామని చెప్పారు. ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే మతాన్ని బీజేపీ రాజకీయాల్లోకి లాగుతోందని విమర్శించారు. అంబానీ, అదానీలకు రాహుల్ గాంధీ డబ్బులు ఇస్తుంటే సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా చేయడం దారుణమని పోల్చారు. మంగళసూత్రాలు తీసుకోవడం అనేది దేశంలో ఎక్కడ జరగలేదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడవద్దని సూచించారు.
బీజేపీ జనాన్ని భయపెట్టే కుట్రల చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో తెలంగాణకు ఏం వచ్చాయని నిలదీశారు. హైదరాబాద్‌కు ఒక్క పెద్ద ఇన్వెస్ట్మెంట్‌ను మోడీ తీసుకురాలేదన్నారు. మోడీ సర్కార్ ధనవంతుల ప్రభుత్వమని దుయ్యబట్టారు. అదానీ, అంబానీలతో ఎవరికి దోస్తానా అనేది అందరికీ తెలుసన్నారు. వాళ్ల ఫైట్లల్లో ఎవరు తిరుగుతారో ప్రజలకు కూడా తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా ప్రతి మహిళా ఖాతాలో రూ. లక్ష వేస్తామన్నారు. ఉపాధి హామీ కూలీ రూ. 400లకు పెంచుతామన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కలిపిస్తామన్నారు. సివిల్ సర్వీస్ ఆఫీసుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 27 శాతమే ఉన్నారని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎవ్వరికీ ఏం కావాలో అవి అందిస్తామని చెప్పారు. హస్తం శాశ్వతమని, కమలం వాడిపోతుందని ఎద్దేవా చేశారు. పబ్లిక్ సెక్టార్ ఆస్తులను అదానీ, అంబానీలకు మోడీ సర్కార్ కట్టబెట్టిందన్నారు. దేశంలో సగం జనాభా ఆస్తులు వారి దగ్గరే ఉన్నాయని వ్యాఖ్యానించారు. టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. దమ్ముంటే ఆ డబ్బులపై విచారణ చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.









