హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి, తప్పుడు ఫిర్యాదు చేయమని బలవంతం చేశారని ఆమె పేర్కొన్నట్టు జాతీయ మహిళా కమిషన్ (NCW) తాజాగా వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ ప్రకటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి.. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు మరక అంటించాలని కోరుకుంటోందని దుయ్యబట్టారు.
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల పెన్‌డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు ముందుకు సాగలేదని కుమారస్వామి మండిపడ్డారు. ఈ కేసులో జనతాదళ్‌కు మరక అంటించాలనేదే ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వకుండే వ్యభిచారం కేసుల్లో బుక్ చేస్తామని బాధితులను సిట్ బెదిరిస్తోందని మాజీ సీఎం ఆరోపించారు.
తాము రక్షించినట్లు చెబుతున్న సిట్.. బాధితురాలిని ఇప్పటి వరకు ఎందుకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదని ఆయన ప్రశ్నించారు. హెచ్‌డీ రేవణ్ణను జైల్లో ఉంచాలని మాత్రమే కాంగ్రెస్ సర్కారు భావిస్తోందన్నారు.









