న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ కొలిన్ మున్రో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ జట్టులో చోటు దక్కకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. చివరిసారిగా 2020లో భారత్‌పై టీ20 సిరీస్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన తరువాత.. క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అందుబాటులోనే ఉంటానని, ఇంకొన్నాళ్లు ఈ మ్యాచ్‌లు ఆడతానని పేర్కొన్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ అయిన కొలిన్ మున్రో 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్‌గా అతనికి పేరుంది. 57 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. వన్డేల్లో 1,271, టీ20 ఇంటర్నేషనల్స్‌ల్లో 1,724 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. స్ట్రైక్ రేట్ 154. 44తో అతని బ్యాటింగ్ పరుగులు పెట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లలో 20కి పైగా జట్లకు మున్రో ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా 13 మ్యాచులు ఆడాడు.









