AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెరుచుకునున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం శుక్ర‌వారం ఉద‌యం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంత‌రం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ముఖ్య‌మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి.

చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్ర‌తి యేటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ప‌ర‌మేశ్వ‌రుడి ద‌ర్శ‌నం కోసం కేదార్‌నాథ్‌కు వ‌స్తుంటారు. కానీ, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు ఇలాగే ఆల‌యం మూసి ఉంచ‌డం జ‌రుగుతుంది. నేడు ఆరు నెల‌ల త‌ర్వాత తిరిగి తెరిచిన‌ సందర్భంగా అధికారులు ఆలయాన్ని పువ్వుల‌తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు యమునోత్రి ఆలయం కుండా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రిఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుచుకోనుంది. ఇక చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు స‌మాచారం.

ANN TOP 10