ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఎల్‌బీస్టేడియం వరకు వచ్చే సమయంలో పీఎన్‌టీ ఫైఓవర్, గ్రీన్‌లాండ్స్, ఎన్టీఆర్‌మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, రవీంద్రభారతి రూట్‌లో వాహనాలను అనుమతించరు. సభ పూర్తయిన తర్వాత ప్రధాని ఇదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వెళ్లే సమయంలో కూడా వాహనాలను అనుమతించరు.
సభకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో వాహనాలను నిలిపేయడంగానీ, దారి మళ్లించడంగానీ చేస్తామని తెలిపారు. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వాహనాలను అనుమతించరు. సుజాత స్కూల్ వైపు నుంచి లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపునకు వాహనాలను అనుమతించరు. రవీంద్రభారతి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పబ్లిక్ గార్డెన్, నాంపల్లి వైపునకు పంపుతారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.









