ఆదిలాబాద్ పాలిటిక్స్ లో మరో సంచలనం
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరింపజేశారన్న పిటిషన్ పై తీర్పు
ఎమ్మెల్సీకి మరో నాలుగేళ్ల పదవీకాలం
(అమ్మన్యూస్, హైదరాబాద్)
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీ సంతకాలతో తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్ కు పత్రాలు ఇచ్చారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేయడంతో పాటు, రూ.50 వేల జరిమానా కూడా విధించింది. దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం కూడా పూర్తికాకుండానే ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. దీతో విఠల్ నెక్ట్స్ ఏం చేస్తారన్న అంశం చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. విఠల్ న్యాయవాది అభ్యర్థనతో తీర్పును 4 వారాలు సస్పెండ్ చేసింది.
మళ్లీ ఎన్నిక ఖాయమా?
దండె విఠల్ కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఓ వైపు అప్పీల్ కు వెళ్ళాలని బిఆర్ఎస్ నేతలు సంప్రదింపులు ప్రారంభించగా, ఈ స్థానానికి వెంటనే ఎన్నిక జరపాలని కాంగ్రెస్, విపక్షాలు కోరనున్నాయి. తమను పోటీలో లేకుండా తప్పుడు పద్దతుల్లో ఉపసంహరింపజేశారని పత్తిరెడ్డిరాజేశ్వరరెడ్డి రుజువుచేయడంతో మళ్ళీ ఎన్నిక అనివార్యంకానుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఆదిలాబాద్ లోకల్ బాడీలో మొత్తం 937 ఓట్లు ఉండగా, ఈ ఎన్నికల్లో దండెవిఠల్ కు 744, స్వతంత్ర అభ్యర్ధికి 74 ఓట్లు పోలయ్యాయి. పోటీదారులతో సంబంధం లేకుండా నామినేషన్ పత్రాలు ఉపసంహరింపజేశారన్న ఆరోపణలపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.









