AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీడిన సస్పెన్స్.. రాయ్ బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటన

దేశ రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల పోటీపై సస్పెన్స్ వీడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ఖరారు చేసింది. ఎన్నికల నామినేషన్ల పర్వం సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది ఉత్కంఠగాను తలపించింది. ఈ క్రమంలోనే రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించింది. చాలా చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమేథీ నుంచి సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మ పేరుని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది.

*పోటీకి దూరంగా ప్రియాంక గాంధీ*

ఇటీవలే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ లో సోనియాగాంధీ గెలిచారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికలకు ఆమె దూరమయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఇక్కడ ఎన్నికలు ముగిశాయి. అయితే మొదట అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆమె ఇప్పుడు కూడా దూరంగా ఉన్నారు. ఎంపీగా పోటీ చేసి ఒకే నియోజవర్గానికి పరిమితం కాకుండా దేశమంతా ప్రచారం నిర్వహిస్తే పార్టీకి మంచి ఫలితాలు అందుతాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చర్చ నడుస్తోంది.

*రాహుల్ నామినేషన్‌కు సీఎం రేవంత్ హాజరు*

నామినేషన్లకు నేడు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి హాజరు కావాల్సి ఉంది. ధర్మపురి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జనజాతర సభలతో పాటు ఉప్పల్‌ రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ అకస్మాత్తుగా రాయబరేలీకి వెళ్లడంతో ఆయన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రద్దయనట్లు సమాచారం.

ANN TOP 10