కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదైంది. అయితే, గురువారం ఉదయం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్, నవీన్, తస్లీమాతో పాటు గీత, శివ, అస్మాలుకూడా ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిలర్స్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు.
అమిత్ షా నీకో న్యాయం.. మాకో న్యాయమా?
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిలర్స్ ను పోలీసులు అరెస్టు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా నీకు ఒక న్యాయం.. మాకొక న్యాయమా? అని ప్రశ్నించారు. నేను ఫిర్యాదు చేసి పదిరోజులైనా ఇంత వరకు స్పందించలేదని అన్నారు. నా క్యారెక్టర్ మీద దెబ్బకొట్టారు.. నేను రిజర్వేషన్లు గురించి మాట్లాడకుండానే నా వీడియో మార్ఫింగ్ చేశారని అమిత్ షా అంటున్నారు. ఢిల్లీ నుంచి పోలీసులు ఇక్కడిదాకా వచ్చి అరెస్టు చేయాలని చూస్తున్నారు. 50శాతం సీలింగ్ ఎత్తేస్తా అని మోదీతో చెప్పిస్తేనే ప్రజలు నమ్ముతారు. లేకుంటే ద్వంద వైఖరి ఉంటే ప్రజలు నమ్మరని హన్మంతరావు అన్నారు. రాహుల్ గాంధీ అంతటా ఒకటే మ్యానిఫెస్టో పెట్టిండు. బీజేపీ తెలంగాణలో ఒక మ్యానిఫెస్టో.. ఆంధ్రాలో ఒక మ్యానిఫెస్టో పెట్టి ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని వి.హన్మంతరావు విమర్శించారు.









