అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన హస్తం పార్టీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని రెడీ అయ్యింది. ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలును ప్రస్తావిస్తూ.. మిగతా హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామని మాటిస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇక టీ కాంగ్రెస్ విడుదల చేయనున్న ప్రత్యేక మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తుందో ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం.









