AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు.. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, ఇతర ఉన్నత పదవులు అలంకరించిన వారంతా.. అధికారం పోయేసరికి పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. చాలా రోజులుగా ఇంద్రకరణ్ రెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా అది జరిగిపోయింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజీనామా పత్రాన్ని పంపించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానం.. ఇంద్రకరణ్ రెడ్డితో మంతనాలు జరిపింది. అంతేకాకుండా ఇంద్రకరణ్ రెడ్డి అన్న చనిపోవడంతో పెద్ది సుదర్శన్‌ రెడ్డి పరామర్శించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అందుకు ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించి.. కాంగ్రెస్‌లో చేరేందుకు అంగీకరించినట్టు ఆయన సన్నిహితులు ఇప్పటికే పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తన అనుచరులతో ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం కూడా అయ్యారు.

ఈ క్రమంలోనే బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను కేసీఆర్‌కు పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

ANN TOP 10