బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, కస్టడీలో ఉన్న నిందితుల్లో ఒకరు తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
పోలీసు కస్టడీలో ఉన్న అనూజ్ తపన్ అనే 32ఏళ్ల నిందితుడు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన జైలు అధికారులు అతడిని వెంటనే సమీపంలోని జీటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన అనూజ్‌ను ఏప్రిల్ 16న పోలీసులు అరెస్ట్ చేశారు.
గత నెల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్‌మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆ దృశ్యాల ఆధారంగా.. నిందితుల్ని గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందిలుల్ని విక్కీ గుప్తా, సాగర్ పాల్‌గా గుర్తించారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.