ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సమన్లపై ఆయన స్పందించారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన తనకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తోందని వ్యాఖ్యానించారు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, స్టేట్ సెక్రటరీ శివకుమార్, స్పోక్స్ పర్సన్ అస్మా తస్లిమ్, నవీన్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ మేరకు మే 01న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు అంటూ అమిత్ షా మాట్లాడుతున్న ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ రెడీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఆ వీడియోను షేర్ చేస్తుంది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని బీజేపీ పిటిషన్లో పేర్కొంది. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.









