పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వీడుతున్న నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. తాజాగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఉదయం ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షీ సమక్షంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ గుత్తా ఫ్యామిలీ కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. దీంతో అమిత్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడటంతో గుత్తా సుఖేందర్ కూడా కారు దిగడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.









