సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రచారంలో ఆరాటం, ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నాయి. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అగ్రనేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లలో సత్తా చాటేందుకు హస్తం పార్టీ సర్వం సిద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులను విజయం వైపు కృషి చేసేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. మే 05న నిర్మల్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరవుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.









