కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ బ్రిటిష్ పార్టీ అని, బీజేపీ స్వదేశీ పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్‌లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల నుండి పార్లమెంట్ పరిధిలో తాము చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓకే నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్లు అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు చుట్టపు చూపుగా వచ్చి పోయే వాళ్ళని విమర్శించారు. బీజేపీ అభివృద్ధి చేయలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో హామీలు ఎందుకు నెరవేర్చలేదన్నారు.
మోడీ ప్రధాని అయితేనే దేశం మరింత అభివృద్ధి జరుగుతుందని, సర్పంచ్‌లు, నాయకులు కూడా అంటున్నారని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. అంబేద్కర్ పార్థివ దేహాన్ని ఢిల్లీలో కాకుండా ముంబై పంపించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లనే ప్రధాని అయినా అని చెప్పిన వ్యక్తి మోడీ అని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడింది బీజేపీ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయింది ఎక్కడ రిజర్వేషన్ రద్దు చేయలేదన్నారు. రాముడు అంటేనే రాక్షసులకు భయం అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొస్తోందని విమర్శించారు. రిజర్వేషన్ల రద్దు ఉండబోదు అని ఇప్పటికే ప్రధాని మోడీ క్లియర్‌గా చెప్పారని గుర్తు చేశారు. అయినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్ పడుతోందన్నారు. బీజేపీ ఒక మతానికి పరిమితం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని అన్నారు. జనాల్ని ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12కు పైగా సీట్లు గెలుస్తామని, కేంద్రంలో 400 మార్కును టచ్ చేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.









