బీజేపీ నయవంచన పేరుతో కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల
(అమ్మన్యూస్, హైదరాబాద్)
గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం–వందేళ్ల విధ్వంసం అనేది ట్యాగ్‌లైన్‌తో ఛార్జ్‌షీట్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
పదేళ్ల పాటు మోదీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే ఆయన ఉపయోగపడ్డారన్నారు. పత్రి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని చెప్పిన మోదీ మాట తప్పారన్నారు. అగర్ బత్తీలను కూడా వదలకుండా జీఎస్టీని విధించారన్నారు. ఉద్యోగాలిస్తామని చెప్పి యువతను మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తుల మొత్తాన్ని అదానీకి అప్పగించిందన్నారు. గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేశారన్నారు. పెట్రోలు ధరలు పెరిగిపోయి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
రిజర్వేషన్లు రద్దుచేసే కుట్ర కూడా జరుగుతుందని ఆయన అన్నారు. రైతులకు పార్లమెంటు సాక్షిగా మోదీ క్షమాపణలు చెప్పారన్నారు. పిల్లలు వాడే పెన్సిల్ మీద కూడా జీఎస్టీ వేసి దోచుకునే ప్రయత్నం చేశారన్నారు. రాజ్యాంగంపై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందన్నారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తారన్నారు. దేవుళ్లను, మతాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలుచేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, మీ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని అన్నారు. మోసపూరిత హామీలతో ఆ పార్టీ ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు.