గత పదేళ్లు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రెండు కలిసి నడిచాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా మడికొండలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా వరంగల్ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా యువతను మోసం చేసిందన్నారు. తాము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ భయపడుతుందని, హామీల అమలు చూసి హరీష్ రావుకు భయం పట్టిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చేసారి పోటీ చేయమని చెప్పారు. మోడీ పాలనలో అన్నింటిపై పన్నులు వేసి దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడ్డామని చెప్పారు. కడియం కావ్య స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కావ్యను ఆశీర్వదించాలని కోరుతున్నానని, ప్రజాసేవ కోసం వచ్చిన తనను గెలిపించాలని శ్రీధర్ బాబు కోరారు.
