అబద్దాలకి పెట్టింది పేరు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎదిగారని అన్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. ఇందిరా గాంధీ చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, ఆరేళ్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం జైలు జీవితం గడిపిన చరిత్ర నరేంద్ర మోడీ, కేసీఆర్‌కు ఉందా అని నిలదీశారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. ఇందిరా గాంధీ 16 ఏళ్లు ప్రధానిగా ఉండి దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలోని దళితులకు ప్రభుత్వ భూములను పంచి పెట్టారని తెలిపారు. పేదలను దృష్టిలో పెట్టుకుని ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసిందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని తెలిపారు. యువత భజరంగ్ దళ్ పాటలకు చిందులు వేయడం కాదని, చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.
కేసీఆర్ ప్రసంగంలో ఒక ఫ్రస్టేషన్ స్పష్టంగా కనపడిందని చెప్పారు. పార్టీని కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని కామెంట్స్ చేశారు. ఎన్ని ఫీట్లు చేసినా రాష్ట్రంలో పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు వంచనకి గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీడియాని ఆమడ దూరం పెట్టి ఉన్న కేసీఆర్ నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ నాలుగు గంటలకు కూర్చున్నారంటే ఎంత భయం పుట్టుకొచ్చిందో అర్థమైందని జగ్గారెడ్డి తెలిపారు.









