ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి ఉంటారని చెప్పినట్లు గుర్తు చేశారు. బుధవారం నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు తనను గెలిపించడంతో మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఆయనకు భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం కూడా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరిలో చేసిన వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.









