AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. ఖజానాను ఖాళీ చేయడం కాదు!

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన నేతలు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీలో చేరాలని చెప్పారు. పార్టీ మారకుండా ఆ పార్టీపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉప రాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించానని, అందుకే రాలేదని స్పష్టం చేశారు. ఇకపై ప్రజలతో ఉంటా.. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను ప్రధానితో చర్చిస్తానని, ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్లనన్నారు.

*పార్టీ మారడం ట్రెండ్‌గా మారింది..*

అలాగే పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరోచ్చని, పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. పార్టీలు మారడం ట్రెండ్ అవుతోందని, యాంటీ డిఫెక్షన్ లాను బలోపేతం చేయాలన్నారు. రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలు ఇవ్వాలని తెలిపారు. చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవమన్నారు. తాను ఉచితాలకు వ్యతిరేకం అన్నారు. విద్య ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని, ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతిపరులను ప్రజలు తిరస్కరించాలన్నారు. పార్టీకి నేను ఇచ్చే స్థానం నా జీవితంలో మారదన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించ వద్దని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాలన్నారు. పార్టీ మారిన వారు వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. రాముడు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదని, రాముడు ఈ దేశానికి ఆదర్శ పురుషుడని చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇబ్బడి ముబ్బడిగా మేనిఫెస్టోల్లో హామీలు ఇస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు తగిన ఆర్థిక వనరులను పార్టీలు చూపించాలని అన్నారు. అప్పులు పెరిగిపోతున్న ఈ సమయంలో ఉచితాలు మానుకోవాలన్నారు. ఏ పార్టీకైనా మీరు ఓటెయ్యండి.. అవినీతిపరులకు ఓటు వేయవద్దని వెంకయ్య నాయుడు సూచించారు.

ANN TOP 10