AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది- సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అందులో జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాబోతున్నారని, జిల్లాను అభివృద్ది చేస్తారని ఆయన అన్నారు. జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా కేంద్ర పెద్దలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా.. ఆయనను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”2021 జనవరి 31న ఆర్మూర్ లో పసుపు బోర్డుపై ఆందోళన చేపట్టిన రైతులకు నేను మద్దతు పలికా. ఆనాడు పసుపు బోర్డు కోసం ఉద్యమించిన వారికి మద్దతు తెలిపినందుకు టీపీసీసీ పగ్గాలు చేపట్టా. అందుకే నాకు నిజామాబాద్ అంటే అభిమానం. 17 సెప్టెంబర్ లోపల చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. కవిత ఐదేళ్ల కాలంలో పసుపు బోర్డు తెరిపించలేదు. ఎర్ర జొన్నలకు మద్దతు ధర కల్పించలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న కవితను 100 కిలోమీటర్ల దూరంలో తరిమిన చరిత్ర నిజామాబాద్ కు ఉంది. 5 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఐదేళ్లైనా పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పటం లేదు.

ఏ ప్రభుత్వమైనా మెడలు వంచి తమ పని చేయించుకున్న చరిత్ర ఆర్మూర్ ప్రాంత రైతులకు ఉంది. ఆనాడు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తాను మల్కాజ్ గిరి పార్లమెంటులో ఎంపీగా పోటీ చేసి గెలిచా. 2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది. దేవుడు గుడిలో వుండాలి. భక్తి గుండెల్లో వుండాలి. పోలింగ్ బూత్ డబ్బాలలో కాదు. సెక్యూలర్ పాలన కోసమే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చారు. బాసర సరస్వతి అమ్మవారిపై ఒట్టేసి చెబుతున్నా.. ఆగస్ట్ 15 లోపల రైతుల రుణమాఫీ చేసి తీరతా. రైతులు ఎంతైనా వరిని పండించుకోండి. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తాం” అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

రూ.2లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..
రూ.2లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరతామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చిందని వెల్లడించారు.

ANN TOP 10