పేదల కోసం రాముడు పాలన చేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గుడి నిర్మాణం చేస్తే రాముడు సంతోషిస్తానని రాముడు అనలేదని గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. కిషన్ రెడ్డి, ఈటల, సంజయ్‌లు రాజకీయంగా బతకాలి అంటే.. జై శ్రీరామ్ అనకతప్పదని వ్యాఖ్యానించారు. రామాలయ నిర్మాణంతో సమస్యలు పోయాయా అని ప్రశ్నించారు. శ్రీరామ చంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే అన్నారు. రాముని ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు. ఈటల రాజేందర్ రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని అన్నారు. రాహుల్ గాంధీ చరిత్ర రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులు అంటూ ఫైర్ అయ్యారు. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయని అన్నారు. మోడీ ప్రధాని కాకముందు.. అద్వానీ రథయాత్ర ప్రారంభ సమయంలో ఆయన వెనక ఉండి సర్వీస్ చేసిన వ్యక్తి మోడీ అన్నారు. రాహుల్ గాంధీకి మోడీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వానీ రథయాత్రకి ముందు దేశానికి, గుజరాత్‌కి మోడీ ఎవరో కూడా తెలియదని కామెంట్స్ చేశారు. అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికలల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోడీ గెలిచిన తర్వాత అద్వానీ సిల్డ్ కవర్‌లో సీఎంగా ప్రకటించారని దుయ్యబట్టారు. మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు.
మోడీ ప్రధాని కాకముందు ఏం పోరాటం చేశారు..
రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్‌లో డిసైడ్ చేశారని, సీఎంలను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి.. సీల్డ్ కవర్ సీఎం మోడీకి చాలా తేడా ఉందని అభిప్రాయపడ్డారు. మోడీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్.. మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్ అంటూ డైలాగ్‌లు చెప్పారు. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోడీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని తెలిపారు. సీట్ల కేటాయింపులతో సమస్యలు పోవని, కొందరికి సీట్ల విషయంలో అన్యాయం జరగవచ్చని ఆయన తెలిపారు. అధికారంలో ఎన్ని ఏళ్లు ఉన్నమనేది.. కాదని, ప్రజలు ఎంత తృప్తితో జీవిస్తున్నారు అనేది రామ రాజ్యమన్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో.. 56 లక్షల కోట్లు అప్పు ఉంటే.. పదేళ్ళలో మోడీ పాలనలో అప్పులు డబుల్ అయ్యాయని విమర్శించారు. మోడీకి రాముడు అప్పులు చేయమని చెప్పాడా.. ఏ గ్రంథంలో అప్పులు చేయమని ఉందని జగ్గారెడ్డి నిలదీశారు.