ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. తాజాగా శనివారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 35వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్ ఫ్రేజర్ (18 బంతుల్లో 65, 5 ఫోర్లు, 7 సిక్స్ లు ), అభిషేక్ పోరెల్ ( 22 బంతుల్లో 42, 7 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రిషబ్ పంత్ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్స్) చాలా సేపు క్రీజులో ఉన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడం, భారీ లక్ష్య ఛేదన కావడంతో ఢిల్లీకి పరాభవం తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 4, మయాంక్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 2, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్‌లకు తలో వికెట్ దక్కింది. ఐపీఎల్ 2024 లో హైదరాబాద్‌కు ఇది ఐదో విజయం. అదే సమయంలో ఢిల్లీకి ఐదో ఓటమి.
అంతకు ముందు ట్రావిస్ హెడ్ 89, అభిషేక్ శర్మ 46 పరుగులు చేశారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 131 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ అవుటైన తర్వాత మిడిలార్డర్ నిరాశపర్చింది. దీంతో హైదరాబాద్ రన్ రేట్ నెమ్మదించింది. నితీష్ రెడ్డి 37, హెన్రిక్ క్లాసెన్ 15, ఐడాన్ మర్క్రామ్ 1 రనౌట్ అయ్యారు. అయితే తర్వాత షాబాజ్ అహ్మద్ ఎట్టకేలకు భారీ షాట్లు కొట్టి హైదరాబాద్ 250కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. షాబాజ్ 59 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 13 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ కోల్పోయారు.