టచ్‌చేసి చూడు.. మాడి మసైపోతావ్
(అమ్మన్యూస్, మెదక్):
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌లో జరిగిన జనజాతర సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని.. ముందు ఆయన పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో తానూ చూస్తానని అన్నారు. తాను హెచ్.టి.వైర్ లాంటోడిని.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్.. అని కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నిగ్ ఇచ్చారు.
కేసీఆర్.. ఎవరితో వస్తావో.. రా.. ఇక్కడుంది జైపాల్‌రెడ్డి, జానారెడ్డి కాదని, బిడ్డా బట్టలూడదీసి పరిగెత్తిస్తా.. అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే నీలం మధుని మెదక్ ఎంపీగా గెలిపించాలని కోరారు. 15 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. మెదక్ పాతికేళ్లుగా బీఆర్‌ఎస్, బీజేపీ చేతిలోనే ఉందన్నారు.
హామీ ఇచ్చిన రెండు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుసార్లు అవకాశం వచ్చినా ప్రధాని పదవి రాహుల్ తీసుకోలేదని గుర్తుచేశారు. నీలం మధును గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.