ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పనులే తన గెలుపుకు బాటలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను ప్రజలతోనే ఉంటానని, ప్రజల కోసమే కొట్లాడతానని చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో మోడీ వే నడుస్తుందన్నారు. నో కరెప్షన్, ఓన్లీ డెవల్‌పమెంట్ అని చెప్పారు. కాంగ్రెస్‌ది చేయి గుర్తుకాదని, చెంప దెబ్బగుర్తు అని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం అసాధ్యమని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరుగ్యారంటీలు అమలు కావన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు అన్ని పార్టీల సర్పంచ్‌లకు రాజకీయాలకు అతీతంగా ఇచ్చానన్నారు. రూ.11 కోట్ల నిధుల్లో 1,094 పనులకు రూ.7 కోట్ల పై చిలుకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి కేవలం 49 పనులు మాత్రమే చేపట్టారని విమర్శించారు. కేంద్ర మంత్రి గడ్కరి శంకుస్థాపన చేసినా, అప్పా జంక్షన్ టు మన్నేగూడ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు చేతకాలేదని అన్నారు.
తాండూర్ కంది పప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో మొదటి సారిగా గళమెత్తినది తానే అని పేర్కొన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం వంద కోట్లు తీసుకు వచ్చానని, తాండూరులో నాపరాతి పరిశ్రమకు జీఎస్టీ 18 నుంచి 5 శాతం వరకు తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. తనను మరోసారి చేవెళ్ల ఎంపీగా గెలిపిస్తే.. వికారాబాద్ నుంచి తాండూరు వరకు నాలుగులైన్ల రోడ్డు, శంకర్‌పల్లి నుంచి వయా మోమిన్‌పేట రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు విస్తరణ పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. శంకర్‌పల్లి నుంచి తాండూరు వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకు రావడంలో బీఆర్‌ఎస్ చేతులెత్తేసిందన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం సర్వే మొదలైనదని, వికారాబాద్ మొదటి స్టాప్ అని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకుంటామన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతమైనట్లు చెప్పారు. చేవెళ్లలో త్వరలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు ప్రధాని మోడీ హాజరవుతున్నట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.