పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తెలంగాణ బీజేపీ. జాతీయ పెద్దలతో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం, అభివృద్ధి కోసం ప్రజలు ఆశించారని.. బీఆర్‌ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.
జమ్ము కాశ్మీర్ 369 ఆర్టికల్ లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేశామని చెప్పారు. త్రిపుల్ తలాక్ ఎత్తేశామని… మహిళలకు గౌరవం ఉండాలని చట్టాలు చేశామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉమ్మడి పౌర చట్టం తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేదరికం పోగడుతాం అన్నారని… దేశంలో పేదరికం పెరిగిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదరికం పోయిందని అన్నారు.