AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లాస్ట్ వన్డేకి భారత్ జట్టులో మార్పు?

ఆస్ట్రేలియాతో బుధవారం జరగనున్న మూడో వన్డేకి భారత్ జట్టులో ఒక మార్పుని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా టీమ్ 10 తేడాతో గెలిచింది. దాంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమమైంది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక లాస్ట్ వన్డే మ్యాచ్ చెన్నై(Chennai)లోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకి ప్రారంభంకానుంది.

చెపాక్ వన్డేకి భారత్ తుది జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)ని తప్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో నెం.4లో ఆడిన సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఒకే తరహాలో ఎల్బీడబ్ల్యూగా సూర్యకుమార్ యాదవ్ ఔటైపోయాడు. దాంతో మూడో వన్డే ముంగిట అతనిపై ఒత్తిడి పతాక స్థాయికి చేరిపోయింది. టీ20ల్లో టాప్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. వన్డే, టెస్టుల్లో మాత్రం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు.

టీమిండియా మేనేజ్‌మెంట్ మూడో వన్డేకి ఒకవేళ జట్టులో మార్పులు చేస్తే? సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సంజు శాంసన్‌(Sanju Samson)ని ఆడించాలని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించాడు. సంజు శాంసన్ ఎప్పుడు తనకి ఛాన్స్ దొరికినా చక్కగా ఆడుతున్నాడని కూడా జాఫర్ గుర్తు చేశాడు. కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే? ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో అసలు సంజు శాంసన్ లేడు. కానీ.. అతనికి లాస్ట్ వన్డేలో అవకాశం ఇవ్వాలని వసీం జాఫర్ కోరడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ANN TOP 10