గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సుమారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అభివృద్ధిపై గురువారం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పని చేశానని అన్నారు. విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశానని చెప్పారు. రాష్ట్రంలో పనులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే జరుగుతాయన్నారు. కేంద్రం కొంత నిధులు ఇస్తుంది తప్ప.. స్వయంగా పనులు కేంద్రం చేయదన్నారు. కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలు తనకు అప్పగించిందన్నారు. ఆర్టికల్ 370ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను కాపాడుకున్నామని తెలిపారు.
ఆర్టికల్ 370పై సమీక్ష చేయడానికి ఏర్పడ్డ కమిటీలో తనకు సభ్యత్వం ఇవ్వడం అదృష్టమని అన్నారు. రైతు ఉద్యమం నడుస్తున్న సమయంలో ఢిల్లీలో చాలా రోజులు ఉండి.. లా అండ్ ఆర్డర్ సమీక్ష చేసే బాధ్యత కూడా నిర్వహించానని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు సదుపాయాలు అందే విధంగా కృషి చేశానని, టూరిజం మినిస్ట్రీస్, కల్చర్ మినిస్ట్రీస్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మూడు శాఖలు తనకు అప్పగించిందని తెలిపారు. మూడు శాఖలు అప్పగించడంతో ఆశ్చర్యం వేసిందని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉన్న ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ బాధ్యతలు కూడా సమన్వయంతో నిర్వహించామని చెప్పారు. జీ-20 సమావేశాలు నిర్వహణ బాధ్యతల్లో తనకు అవకాశం కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడు శాఖలు అప్పగించడం వల్ల అధిక సమయం ఢిల్లీలో కేటాయించాల్సి వచ్చిందన్నారు. సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సుల ద్వారానే ఇది సాధ్యం అయ్యిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.