ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. 17 ఎంపీ నియోజకవర్గాల అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల విలువ చేసే చెక్కులను కూడా కేసీఆర్ అందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నట్లు సమాచారం. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటల వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్డు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భవన్ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ గులాబీ శ్రేణులకు అభివాదం చేస్తూ భవన్‌లోకి వెళ్లారు.