ముగ్గురు బీజేపీ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు
రేపు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కీలక అంకం మొదలైంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాకలు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
తొలిరోజు ముగ్గురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు
తెలంగాణలో ముగ్గురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ , నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. రేపు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. ఏపీలోని ఒంగోలు లోక్‌సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు (టీడీపీ), విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్‌రెడ్డి (టీడీపీ), బుట్టా రేణుక (వైసీపీ) శ్రీశైలం అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి (వైసీపీ).. నెల్లూరు జిల్లా కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (టీడీపీ), గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ) నామినేషన్ పత్రాలను ఆర్వోకి సమర్పించారు.