లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తెలంగాణ, ఏపీలో రేపు ప్రారంభం కానుంది. మే 13న జరగనున్న ఎన్నికలకు.. తెలంగాణలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ (ఉపఎన్నిక) స్థానంలో.. ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. రేపే నామినేషన్ దాఖలు ప్రారంభం కావడంతో.. నామినేషన్ వేసేందుకు నేతలు ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా రేపు మంగళగిరి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ తరపున ఈనెల 22న ఒక సెట్ నామినేషన్ ను ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేయనున్నారు. మరోవైపు జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీ ఫామ్‌లను అందజేశారు.
