పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చకపోతే వదిలిపెట్టమని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు తప్పదని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ పరిస్థితులు సంభవిస్తాయో అని ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. ఖమ్మం, నల్గొండ మానవ బాంబులతో ముఖ్యమంత్రికి ప్రమాదం ఉందని, ప్రభుత్వం కూలడం ఖాయమని వ్యాఖ్యానించారు. యావత్ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇంత ప్రమాదం జరుగుద్దని ప్రజలు ఊహించలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కారు రిపేర్ అయ్యి దూకుడు పెంచిందన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకునే 14 సీట్లు కారు ఖాతాలోనే పడతాయని ధీమాను వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి భంగపాటు తప్పదని, ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని రేగా కాంతారావు అన్నారు.
