భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కల్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు.
రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తూ…
తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు దంపతులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పి.ఎస్. నర్సింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా కళ్యాణంలో పాల్గొన్నారు. రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమ్రోగింది. భక్తులంతా శ్రీరాముడి కళ్యాణాన్ని వీక్షిస్తూ పరవశించి పోయారు.