కాంకెర్: ఛత్తీస్‌గడ్‌లో కాంకెర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఎన్‌కౌంటర్‌ను, ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్యను కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ప్రకటించారు. చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని వివరించారు.
కాగా మంగళవారం మధ్యాహ్నం ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్ రావు కూడా ఉన్నారు. శంకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే-47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఛోటె బతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన కాంకెర్ జిల్లాలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది.