ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతర విషయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. సినిమాలు, క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడతారు. తనకు నచ్చిన వాటి గురించి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు. ఆదివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (CSK vs MI) జట్ల మధ్య ఐపీఎల్ (IPL 2024) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni) వరుస సిక్స్‌లతో హల్‌చల్ చేశాడు.
“ధోనీ కంటే గొప్పగా ఆడుతున్న మరో ఆటగాడిని చూపించగలరా? అతడిపై ఉన్న అంచనాలు, జట్టు పరిస్థితి ధోనీ సంకల్పాన్ని మరింత పెంచాయి. ధోనీ ఎప్పటికీ గొప్ప ఫినిషర్. నా పేరులో కూడా మహి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా“ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు సిక్స్ కొడుతున్న ధోనీ ఫొటోను జత చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ ట్వీట్‌ను ఇప్పటికే 13 లక్షల మందికి పైగా వీక్షించారు. 49 వేల మందికి పైగా లైక్ చేశారు.