జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త చిందులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై విచారణ జరిపి.. ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను వీఆర్‌కు బదిలీ చేస్తూ మల్టీజోన్ ఐజీపీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహదేవ్‌పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో స్టెప్పులు వేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త డ్యాన్ చేసింది నిజమేనని నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాస్ స్టేషన్ ఇన్‌చార్జిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించడంతో ప్రజల పరిరక్షణ కోసం ఉండాల్సిన పోలీస్‌స్టేషన్‌లో ఓ ప్రైవేటు వ్యక్తి నృత్యం చేసేందుకు ప్రోత్సహించినందుకు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. స్టేషన్ ఎస్‌హెచ్‌వో జీవీ ప్రసాద్‌ను వీఆర్‌కు బదిలీ చేసినట్లు ఐజీపీ ఏవీ రంగనాథ్ వివరించారు.