బీఆర్ఎస్ నేత, ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఏపూరి సోమన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. తిరిగి మళ్లీ హస్తం పార్టీలో చేరారు. గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యేగా తాను వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ సమయంలో షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో వైఎస్సార్టీపీకి సోమన్న గుడ్ బై చెప్పారు. షర్మిల పార్టీలో చేరకముందే ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు కూడా. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సోమన్న చురుకైన పాత్ర పోషించారు. బడుగు బలహీన వర్గాల బలమైన గొంతుకగా ప్రజాదరణ పొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన పాటల ద్వారా భారీ మద్దతు కూడగట్టడంలో ఏపూరి సోమన్న కీలకపాత్ర పోషించారు.
