AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళకు బీజేపీ ఎంపీ ముద్దు.. పశ్చిమ బెంగాల్‌ ఉత్తర మాల్దాలో వివాదాస్పద ఘటన

నెట్టింట జోరుగా వైరల్‌
ఎంపీ తీరుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘాటు విమర్శలు

(అమ్మన్యూస్‌, కోల్‌కతా):
పశ్చిమ బెంగాల్‌ ఉత్తర మాల్దా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఖగేన్‌ ముర్ము ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మహిళ చెంపపై ముద్దు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆయన సిట్టింగ్‌ ఎంపీ. 2019లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 84వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. బీజేపీ మళ్లీ ఆయనకే టిక్కెట్‌ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని చంచల్‌లో గల శ్రీహపూర్‌ గ్రామంలో రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మహిళను ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలోకి వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ‘మహిళల విషయంలో మోదీ పరివార్‌ ఎలా ఉందో చూడండి. ఇక వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఊహించవచ్చు’నని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ మాల్దా జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ దులాల్‌ సర్కార్‌ ఈ ఘటనను ఖండిరచారు. ఇది బెంగాలీ సంస్కృతికి విరుద్ధమన్నారు. ఓట్లు అడుక్కునే సమయంలోనే ఇలా చేస్తే వారు గెలిచిన తర్వాత ఎలా ఉంటారో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక ఈ అంశంపై ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.

ఖగేన్‌ ముర్ము ఈ ఘటనపై స్పందిస్తూ… బిడ్డని ముద్దు పెట్టుకోవడంలో తప్పు ఏముంటుందని ప్రశ్నించారు. తనపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చెడుగా ఆలోచించే వారికి అలాంటి విలువలే ఉంటాయన్నారు. ముద్దు ఘటనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలపై తాను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ANN TOP 10