AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అన్న వ్యవహారశైలి గిట్టకే.. బీఆర్ఎస్ నేత ప్రవీణ‌కుమార్‌కు సోదరుడు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం!

బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ఆయన సోదరుడు ప్రసన్నకుమార్ గుర్రుగా ఉన్నారు. ‘బహుజన రాజ్యం’ రావాలంటూ రాష్ట్రమంతా తిరిగి కేసీఆర్ పైనా, ఆయన ప్రభుత్వంపైనా దుమ్మెత్తిపోసిన ప్రవీణ్‌కుమార్ కోసం ప్రసన్నకుమార్ తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. పశుసంవర్థకశాఖలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన సోదరుడి ఉదాత్త లక్ష్యాన్ని చూసి ఆయన వెంట నడవాలని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. అన్నకు మద్దతుగా సొంత నియోజకవర్గమైన అలంపూర్ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్సీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు.

పొత్తు ఖరారు తర్వాత పార్టీ మార్పు
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. పొత్తు ఖరారైందని కూడా ప్రకటనలు వచ్చాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా బీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

అన్న వ్యవహారశైలి గిట్టకే
బీఆర్‌ఎస్‌లో చేరుతున్న విషయమై సోదరుడు తనతో మాటమాత్రంగానైనా చెప్పకపోవడం ప్రసన్నకుమార్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దొరల రాజ్యం పోవాలంటూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసి తిరిగి ఆయన పంచనే చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలిసింది.

ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి
సోదరుడిని నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయానంటూ సన్నిహితుల వద్ద ప్రసన్నకుమార్ వాపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న ఆయన నేడో, రేపో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. ఆయన ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి సంతప్‌కుమార్, నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవితోనూ సంప్రదింపులు జరిపారు. రేవంత్‌రెడ్డితో సమావేశం తర్వాత కాంగ్రెస్‌లో చేరిక తేదీని ప్రసన్నకుమార్ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.

ANN TOP 10