ఒక్కటే ఎండలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఇంట్లో నుంచి బయటికొస్తే తిరిగి వెళ్లలేని పరిస్థితి! అలాగనీ బయటకూడా ఉండలేక ఎండలకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఏప్రిల్ మొదట్లోనే ఇలాగుంటే చివరికి.. మే నెలలో ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహకందని పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్‌లో అసలే ఎండలు.. దీనికి తోడు వడగాలులు. ఇలా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది.
మరో 5 రోజులపాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండనున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పింది. మధ్య మహారాష్ట్ర దగ్గర ఆవర్తనం కేంద్రీకృతం అవ్వడంతో కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సో.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలు, భాగ్యనగర వాసులకు ఇది ఉపశమనం కలిగించే వార్తే..!