AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతుల పేరిట దొంగ దీక్షలు సిగ్గుచేటు.. మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

ఎన్నికల్లో ఓడిన బీఆర్‌ఎస్ పార్టీకి ఓపిక ఉండాలని, ప్రభుత్వానికి కనీసం సమయం ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సోమవారం గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రైతుల పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది తప్ప పెద్దపల్లి జిల్లాకు చుక్క నీరు రాలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎంతో మంది రైతులు భూములు, ఉపాధి కోల్పోయారన్నారు.

పదేళ్లపాటు రైతుల కష్టాల గురించి ఆలోచించని బీఆర్‌ఎస్ నేతలు రైతుల పేరిట దొంగ దీక్షలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కరువు ఏర్పడితే ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ తెచ్చిన కరువుగా అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మోడల్ ఎమ్మెల్యే అని, జెన్కో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం గత 100 రోజుల్లో వెయ్యి సార్లు ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో పాటు సహచర మంత్రులందరినీ అడిగారన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ఇప్పుడు చేస్తామని, సింగరేణి నిధులను ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం కట్టబెట్టారన్నారు. నాలుగు నెలలు గడవక ముందే, ఓపికతో వ్యవహరించాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేయడం తగదని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10